ముస్హఫ్లో 106వ సూరా, 4 ఆయతులు, 602వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. (అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటు పడ్డారు.
2. (అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు.[1]
[1] ఈలాఫున్: అలవాటు పడటం, సురక్షితంగా కొనసాగించటం. ఖురైషుల ముఖ్య వృత్తి వ్యాపారం. వారు శీతాకాలంలో యమన్ కు మరియు వేసవి కాలంలో సిరియాకు వ్యాపారానికి పోయేవారు. వారు కా'బా నిర్వాహకులు కావటం వల్ల వారి వాణిజ్య బృందాలు ఎలాంటి ఆటంకం, అపాయం లేకుండా ప్రయాణం చేయగలిగేవి.
3. కావున వారు ఈ గృహం (కఅబహ్) యొక్క ప్రభువు (అల్లాహ్) ను మాత్రమే ఆరాధించాలి![1]
[1] చూడండి, 2:125. అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడు అయిన అల్లాహ్ (సు.తా.) వారిని సురక్షితంగా వ్యాపారం చేయనిచ్చినందుకు వారు ఆయనను మాత్రమే ఆరాధించాలి. బహుదైవారాధనను త్యజించాలి.
4. వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు.[1]
[1] వారిని ప్రమాదం నుండి కాపాడేవాడు మరియు వారిని పోషించేవాడు కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే కానీ - వారు పూజించే నిస్సహాయులైన - విగ్రహాలు గానీ, ఇతర కల్పిత దైవాలు గానీ కావు. గనుక వారు వాటి ఆరాధనను మానుకోవాలి. ఇంకా చూడండి, 2:126.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.