తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అద్-దుహా: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 93వ సూరా, 11 ఆయతులు, 596వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-లైల్సూరా అష్-షర్హ్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ప్రకాశవంతమైన ప్రొద్దుటి పూట (పూర్వాహ్ణం) సాక్షిగా!

2. మరియు చీకటి పడ్డ రాత్రి సాక్షిగా![1]

[1] సజా: సకన, అంటే శాంతి నెలకొలినప్పుడు, అంటే పూర్తిగా చీకటి పడినప్పుడు. అప్పుడు నిశ్శబ్దం మరియు నెమ్మది అయి ఉంటుంది.

3. (ఓ ముహమ్మద్!) నీ ప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు.

4. మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది![1]

[1] అంటే పర లోక జీవితం, ఇహ లోక జీవితం కంటే ఉత్తమమైనది.

5. మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు.

6. (ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా[1] చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా?

[1] దైవప్రవక్త ('స'అస) అనాథునిగా ఉంటే అల్లాహ్ (సు.తా.) అతనికి ఆశ్రయం కల్పించాడు. అతని తండ్రి అతని పుట్టుకకు కొన్ని మాసాల ముందు చనిపోయారు. తల్లి అతను 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చనిపోయింది.

7. మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా?[1]

[1] ము'హమ్మద్ ('స'అస)ను ప్రవక్తగా ఎన్నుకొని అతనికి ఖుర్ఆన్ ప్రసాదించి, మార్గదర్శకత్వం చేశాడు.

8. మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా?

9. కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు;

10. మరియు యాచకుణ్ణి కసరుకోకు;

11. మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరంగంగా ప్రకటిస్తూ ఉండు.[1]

[1] అంటే అల్లాహ్ (సు.తా.) చేసిన అనుగ్రహాలను, ఇతరులతో చెప్పుకో - అది అల్లాహ్ (సు.తా.)కు ఇష్టమైనది - గర్వంతో కాక నమ్రతతో!

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-లైల్సూరా అష్-షర్హ్ ›