ముస్హఫ్లో 86వ సూరా, 17 ఆయతులు, 591వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా![1]
[1] చూడండి, 13:11 మరియు 82:10-12.
2. రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?
3. అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.
4. కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు.
5. కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!
6. అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.
7. అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది.
8. నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!
9. ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!
10. అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించుకోవటానికి.
11. వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా![1]
[1] అర్-రజ్'ఉ: తిరిగి రావటం, వర్షం కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ పేరుతో పిలువబడుతుంది.
12. (చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా!
13. నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).
14. మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.
15. (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.[1]
[1] చూడండి, 34:33.
16. మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను.
17. కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధినివ్వు![1] వారికి కొంచెం కాలం గడువు ఇవ్వు.
[1] చూడండి, 7:182-183.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.