తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-ఫజ్ర్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 89వ సూరా, 30 ఆయతులు, 593వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-గాషియహ్సూరా అల్-బలద్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ప్రాంతః కాలం సాక్షిగా![1]

[1] అంటే ప్రతి ఉదయం ఒక ప్రత్యేక ఉదయం కాదు.

2. పది రాత్రుల సాక్షిగా![1]

[1] అంటే జు'ల్-'హజ్ యొక్క మొదటి పదిరాత్రులని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. వీటి ఘనత 'హదీస్' లలో ఉంది. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "జు'ల్-'హజ్జ్ మొదటి పది రోజులలో చేసే సత్కార్యాలు అల్లాహ్ (సు.తా.)కు ఎంతో ఇష్టమైనవి - జిహాద్ కంటే కూడా - మానవుడు అమరగతి నొందిన జిహాద్ తప్ప! ('స'హీ'హ్ బు'ఖారీ).

3. సరి బేసీల సాక్షిగా!

4. గడచిపోయే రాత్రి సాక్షిగా!

5. వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?[1]

[1] అంటే వీటన్నిటి ప్రమాణం చేయటం, అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించటానికి చాలదా! 'హిజ్ రున్: ఆపటం, కాదనటం, బుద్ధి కూడా మానవుడిని చెడు కర్మల నుండి ఆపుతుంది.

6. నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?[1]

[1] వారి ప్రవక్త హూద్ ('అ.స.) చూడండి, 69:7-10 మరియు 7:65-72.

7. ఎత్తైన స్తంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?[1]

[1] ఇరము: ఒక తెగ పేరు. దాని పూర్వోత్తరాలు ఇలా ఉన్నాయి: 'ఆద్ బిన్-'ఔస్ బిన్-ఇరమ బిన్ -సామ్ బిన్-నూ'హ్. (ఫత్హ్ అల్-ఖదీర్) వీరిని 'ఆద్ఊలా, అని కూడా అంటారు.వీరిని ఎత్తైన స్తంభాల (భవనాల) వారని కూడా అంటారు.

8. వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.[1]

[1] 'ఆద్ జాతివారికి తమ బలసామర్థ్యాల మీద ఎంతో గర్వం ఉండేది. చూడండి, 41:15.

9. మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?[1]

[1] వీరి ప్రవక్త 'సాలిహ్' ('అ.స.). చూడండి, 26:149.

10. మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?[1]

[1] అంటే పెద్ద సైన్యం గలవాడు, లేక ప్రజలను మేకులతో నాటి శిక్షించేవాడు. (ఫత్హ్ అల్-ఖదీర్)

11. వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;

12. మరియు వాటిలో అధికంగా అల్లకల్లోలాన్ని (అరాచకాన్ని) వ్యాపింపజేశారు.

13. కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.

14. వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!

15. అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టలను ఇచ్చి అనుగ్రహించినప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;[1]

[1] అల్లాహ్ (సు.తా.) ధనధాన్యాలు, సౌభాగ్యాలు, ఇచ్చినా పరీక్షించటానికే! మరియు పేదరికానికి గురిచేసినా, అదీ పరీక్షించటానికే!

16. కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.[1]

[1] చూఅల్లాహ్ (సు.తా.) తన సద్వర్తనులైన దాసులకు భోగభాగ్యాలు, ధనధాన్యాలు ప్రసాదించవచ్చు! లేక పేదరికానికీ గురిచేసి పరీక్షించవచ్చు. అదే విధంగా సత్యతిరస్కారులకు కూడా ఐశ్వర్యాలివ్వవచ్చు లేక పేదరికంతో పరీక్షించవచ్చు! సద్వర్తనులైన విశ్వాసులు ఐశ్వర్యవంతులుగా ఉంటే అల్లాహ్ (సు.తా.)కు కృతజ్ఞులుగా ఉంటారు. పేదరికానికి గురి అయితే సహనం వహిస్తారు.

17. అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;[1]

[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అనాథులతో మంచిగా వ్యవహరించే వారు స్వర్గంలో నాతో పాటు - రెండు వ్రేళ్ళు తోడుగా ఉన్నట్లు - ఉంటారు." (అబూ-దావూద్) కావున అనాథలను పోషించడం, వారితో మంచిగా వ్యవహరించడం ఎంతో పుణ్యకార్యం.

18. మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;[1]

[1] చూడండి, 107:3.

19. మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.

20. మరియు మీరు ధనాన్ని అమితంగా ప్రేమిస్తారు![1]

[1] జమ్మన్: కసీ'రన్, చాలా.

21. అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;

22. మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.[1]

[1] ఏడు ఆకాశాల దైవదూతలు ఏడు వరుసలలో నిలబడతారు.

23. ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?

24. అతడు: "అయ్యో! నా (శాశ్వత) జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.

25. అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!

26. మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.[1]

[1] చూడండి, 73:12-13.

27. (సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!

28. నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!

29. నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!

30. మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-గాషియహ్సూరా అల్-బలద్ ›