తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-ముతఫ్ఫిఫీన్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 83వ సూరా, 36 ఆయతులు, 587వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-ఇంఫితార్సూరా అల్-ఇంషిఖాఖ్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.

2. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.

3. మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.[1]

[1] ఒక 'హదీస్'లో ఇలా ఉంది: "ఏ సమాజం వారైతే కొలతలలో మరియు తూనికలలో తగ్గిస్తారో! వారిపై కరువు మరియు పరిపాలకుల ఆగడాలు విరుచుకు పడతాయి." (ఇబ్నె - మాజా - అల్బానీ దీనిని 'స'హీ'హ్ గా ప్రమాణీకరించారు) ఈ మూడు ఆయతులు అన్ని రకాల మోసాలను ఖండిస్తున్నాయి.

4. ఏమీ? ఇలాంటి వారు తాము తిరిగి బ్రతికించి లేపబడతామని భావించరా?

5. ఒక గొప్ప దినమున!

6. సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు.[1]

[1] ఇది వారే చేస్తారు, ఎవరైతే పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) ముందు నిలబడవలసి ఉందని నమ్మరో! వారికి అల్లాహ్ (సు.తా.) భయం లేదు, ('స'హీ'హ్ బు'ఖారీ).

7. అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది.

8. ఆ సిజ్జీన్ అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?

9. వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం.[1]

[1] చూసిజ్జీన్, అంటే కారాగారం. ఇక్కడ చెరిగిపోకుండా నష్టం కాకుండా వ్రాసి పెట్టబడిన గ్రంథమని అర్థం.

10. సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది.

11. వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో!

12. మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు.

13. మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.

14. అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది.[1]

[1] రానా: అంటే పాపాల వల్ల హృదయం మీద ఏర్పడే మచ్చ. 'హదీస్'లో ఇలా ఉంది: "మానవుడు పాపం చేసినపుడు అతని హృదయం మీద ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఒకవేళ అతడు పశ్చాత్తాప పడి ఆ పాపం మరల చేయకుంటే అది దూరమై పోతుంది. ఒకవేళ అతడు పాపం మీద పాపం చేస్తూ ఉంటే ఆ నల్లమచ్చ పెరుగుతుంది. చివరకు అది అతని హృదయం మీద పూర్తిగా క్రమ్ముకొంటుంది. అదే 'రానా' అని పేర్కొనబడినది." (తిర్మిజీ', ఇబ్నె-మాజా, ముస్నద్ అ'హ్మద్).

15. అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు (దర్శనం) నుండి నిరోధింప బడతారు.

16. తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు.

17. అప్పుడు వారితో: "దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది.

18. అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది.[1]

[1] 'ఇల్లియ్యూన్, 'ఉలువ్వున్: ఎత్తైన స్థలం. ఇది సిజ్జీన్ కు విరుద్ధ పదం. ఇది ఆకాశాలలో, స్వర్గంలో సిద్ రతుల్ మున్ తహా, లేక 'అర్ష్ దగ్గర ఉన్నచోటు. అక్కడ పుణ్యాత్ముల కరపత్రాలు భద్రపరచబడి ఉంటాయి.

19. మరి ఆ ఇల్లియ్యూన్ అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?

20. అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం.

21. దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు.[1]

[1] యష్ హదు: అంటే ఇక్కడ పర్యవేక్షిస్తుంటారు. అనే అర్థం కూడా వస్తుంది.

22. నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు.

23. ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ.[1]

[1] చూడండి, 75:23.

24. వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు.

25. సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది.[1]

[1] ర'హీఖున్: స్వచ్ఛమైన, తేటైన, ఉత్తమమైన, మధురమైన పానీయం, అందులో ఎట్టి కల్తీ ఉండదు. మ'ఖ్తూమున్: సీలు చేయబడినది. దాని స్వచ్ఛతకు హామీగా. కొందరు 'ఖితామున్ - అంటే సువాసన అంటారు. దాని సువాసన కస్తూరి వలే ఉంటుంది. (ఇబ్నె-కసీ'ర్). 'హదీస్'లో ఉంది: "ఏ విశ్వాసుడైతే, దప్పికగొన్న విశ్వాసునికి నీరు త్రాపుతాడో పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) అతనికి ర'హీఖ్ అల్-మ'ఖ్తూమ్ త్రాపుతాడు మరియు అన్నం పెట్టిన వాడికి స్వర్గపు ఫలాలు తినిపిస్తాడు. మరియు వస్త్రాలు ఇచ్చే వానికి స్వర్గపు వస్త్రాలు ప్రసాదిస్తాడు." (ముస్నద్ అ'హ్మద్, 3/13-14)

26. దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి.

27. మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది.[1]

[1] తస్నీమున్: ఎత్తైన స్థలం, ఆ పానీయం స్వర్గపు ఎత్తైన ప్రదేశం నుండి చెలమల ద్వారా వస్తుంది.

28. అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు.[1]

[1] చూడండి, 76:5-6.

29. వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.

30. మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయినప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు.

31. మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.

32. మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు.

33. మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు!

34. కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు.

35. ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు):

36. "ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?"

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-ఇంఫితార్సూరా అల్-ఇంషిఖాఖ్ ›