తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అబస: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 80వ సూరా, 42 ఆయతులు, 585వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అన్-నాజిఆత్సూరా అత్-తక్వీర్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు;

2. ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని!

3. కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు!

4. లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు!

5. కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో!

6. అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.[1]

[1] ఇక్కడ సూచించబడుతున్నది ఏమిటంటే విధేయులను ఉపేక్షించి, విముఖులయ్యే వారికి బోధన చేయటానికి, ఆసక్తి చూపనవసరం లేదు!

7. ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?[1]

[1] నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే. నీవు వారి వెంటపడి బ్రతిమాలనవసరం లేదు.

8. కాని, ఎవడైతే నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో!

9. మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో!

10. అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు.

11. అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం.[1]

[1] చూడండి, 7:172.

12. కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు!

13. ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది);

14. మహోన్నతమైనది, పవిత్రమైనది;

15. లేఖకుల (దేవదూతల) చేతులలో;

16. వారు గౌరవనీయులు, సద్వర్తనులు (ఆజ్ఞానువర్తనులు).

17. మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు![1]

[1] ఎట్టి ప్రమాణం లేకుండానే పునరుత్థానాన్ని తిరస్కరించే మానవుడికి ఈ శాపం!

18. ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు?

19. అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు.

20. ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;[1]

[1] అంటే అతనికి మంచి-చెడుల మార్గాలు స్పష్టంగా తెలుపబడ్డాయి.

21. ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు;

22. మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపుతాడు.

23. అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు.

24. ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి!

25. నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము.

26. ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో!

27. తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము;

28. మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను;

29. మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను;

30. మరియు దట్టమైన తోటలను;

31. మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను;

32. మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!

33. ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో!

34. ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు;

35. మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి;

36. మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి;

37. ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.[1]

[1] అంటే ప్రతి మానవుడు తన వారిని నిర్లక్ష్యం చేస్తాడు. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "పునరుత్థాన దినమున మానవులందరూ నగ్నశరీరులై ఉంటారు మరియు వారి కాళ్లలో మేజోళ్ళు ఉండవు మరియు వారు ఖత్నా చేయబడకుండా ఉంటారు." అపుపుడు 'ఆయి'షహ్ (ర.'అన్హా): "ఏమీ ఈ విధంగా మర్మాంగాల మీద దృష్టి పడదా?" అని అడుగుతారు. దైవప్రవక్త ('స'అస) దానికి సమాధానంగా ఈ ఆయత్ చదువుతారు. (తిర్మీజీ', నసాయీ').

38. ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి;

39. అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి.

40. మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి.

41. అవి నల్లగా మాడిపోయి ఉంటాయి;

42. అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అన్-నాజిఆత్సూరా అత్-తక్వీర్ ›