ముస్‌హఫ్‌లో 78వ సూరా, 40 ఆయతులు, 582వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?[1]
[1] దైవప్రవక్త ('స'అస) పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ ను మరియు అతనిని ప్రవక్తగా అల్లాహ్ (సు.తా.) ఎన్నుకున్న విషయాన్ని నమ్మలేక సత్యతిరస్కారులు ఒకరితో నొకరు ఈ విధంగా ప్రశ్నించుకున్నారు: "ఏమీ? పునరుత్థానం నిజమేనా? ఇతడు వాస్తవంగానే ప్రవక్తనా?" మొదలైనవి. దానిని అల్లాహ్ (సు.తా.) స్వయంగా జవాబిచ్చాడు.
2. ఆ మహా వార్తను గురించేనా?
3. దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో?
4. అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
5. మళ్ళీ, ఎంత మాత్రమూ కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
6. ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
7. మరియు పర్వతాలను మేకులుగా?[1]
[1] చూడండి, 16:15.
8. మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.[1]
[1] మానవులలో, జంతువులలో మరియు ఇతర ప్రాణంలేని వస్తువులలో కూడా జంటలున్నాయి. ఉదా: రాత్రిం-బవళ్ళు, సూర్య-చంద్రులు, ఆకాశం-భూమి, నలుపు-తెలుపు మొదలైనవి. ఇంకా చూడండి, 36:36.
9. మరియు మేము మీ నిద్రను విశ్రాంతిని ఇచ్చేదిగా చేశాము.
10. మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము.
11. మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
12. మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
13. మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
14. మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.[1]
[1] ము'అ'సిరాత్: నీటితో నిండి ఉండి ఇంకా కురవని మేఘాలు.
15. దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) మొలిపించటానికి!
16. మరియు దట్టమైన తోటలను.
17. నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.[1]
[1] చూడండి, 77:13.
18. ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు.
19. మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
20. మరియు పర్వతాలు కదిలించబడతాయి, అవి ఎండమావులుగా అయిపోతాయి.[1]
[1] చూడండి, 69:14, 14:48, 101:5, 70:9, 56:6, 20:105, మొదలైనవి.
21. నిశ్చయంగా, నరకం ఒక మాటు;
22. ధిక్కారుల గమ్యస్థానం;
23. అందులో వారు యుగాల తరబడి ఉంటారు.[1]
[1] చూడండి 6:128 మరియు 11:107.
24. అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.
25. సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం)[1]
[1] చూడండి, 38:57-58.
26. (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
27. వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
28. పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు.
29. మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.[1]
[1] చూడండి, 36:12.
30. కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఇక మేము మీకు శిక్షను తప్ప మరేమీ ఎన్నటికీ అధికం చేయము.[1]
[1] చూడండి, 4:56, 17:97.
31. నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
32. ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ!
33. మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు;
34. మరియు నిండి పొర్లే (మధు) పాత్ర
35. అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
36. (ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
37. భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
38. ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్)[1] మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు మరియు సరైన మాట పలికేవాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు.[2]
[1] చూడండి 16:2 మరియు 97:4 [2] అల్లాహ్ (సు.తా.) దైవదూతలకు మరియు దైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) మాట్లాడే అనుమతినిస్తాడు. వారు కేవలం సత్యమే పలుకుతారు. చూడండి, 10:3.
39. అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి![1]
[1] చూడండి, 69:1.
40. నిశ్చయంగా, మేము అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు.[1] మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది[2]!" అని వాపోతాడు.
[1] చూడండి 18:49 మరియు 75:13 [2] చూడండి, 69:27.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.