తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-ఖియామహ్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 75వ సూరా, 40 ఆయతులు, 577వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-ముదథ్థిర్సూరా అల్-ఇన్సాన్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. అలా కాదు! నేను పునరుత్థాన దినం సాక్షిగా శపథం చేస్తున్నాను.

2. అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ సాక్షిగా శపథం చేస్తున్నాను.

3. ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా?

4. వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్థులము.

5. అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు.

6. అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు.

7. కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు;

8. మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు;

9. మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు;

10. మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు.

11. అలా కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు!

12. ఆ రోజు నీ ప్రభువు వద్దనే (అందరి) గమ్యస్థానం ఉంటుంది.

13. ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపింది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది[1].

[1] చూడండి, 18:49.

14. అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు;

15. మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే![1]

[1] చూడండి, 24:24, 36:25 లేక 41:20-22.

16. నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) త్వరగా కంఠస్థం చేసుకోవాలని, దానితో నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు[1].

[1] జిబ్రీల్ ('అ.స.) ఖుర్ఆన్ అవతరింపజేసేటప్పుడు, దైవప్రవక్త ('స'అస) ఏ పదాన్ని కూడా మరచిపోరాదని త్వరత్వరగా చదివేవారు. అల్లాహుతా'ఆలా త్వరత్వరగా చదువటం నుండి నివారించాడు. ('స.బు'ఖారీ). ఇటువంటి వాక్యానికై చూడండి, 20:114.

17. నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే!

18. కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు.

19. ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే[1]!

[1] దైవప్రవక్త ('స'అస) ఖుర్ఆన్ ను ప్రజలకు అర్థమవటానికి వివరించి చెప్పింది కూడా అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి, తనకు తెలుపబడిందే. ఈ వివరణలే 'హదీసులు!

20. అలా కాదు! వాస్తవానికి మీరు శీఘ్రంగా లభించే (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు;

21. మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు![1]

[1] అంటే పరలోక జీవితాన్ని నమ్మటం లేదు. మీరు మీ జీవితం కేవలం ఈ ఇహలోక జీవితం మాత్రమే అనే భ్రమలో పడి ఉన్నారు. మీరు పునరుత్థరింపబడతారని నమ్మటం లేదు.

22. ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;

23. తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి[1];

[1] ఇవి విశ్వాసుల ముఖాలు.

24. మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి[1];

[1] ఇవి సత్యతిరస్కారుల ముఖాలు.

25. నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి[1].

[1] అంటే వారు నరకంలో వేయబడతారని తెలుసుకొని.

26. అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు[1];

[1] మరణం ఆసన్నమైనప్పుడు.

27. మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది[1].

[1] ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 28:71-72.

28. మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు;

29. మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది[1].

[1] అంటే అతడు తాను కష్టాల పాలవుతున్నానని తెలుసుకుంటాడు.

30. ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది!

31. కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు[1]!

[1] చూడండి, 4:17-18.

32. మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు!

33. ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు!

34. (ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది!

35. అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది!

36. ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా?

37. ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా?

38. తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు[1].

[1] చూడండి, 87:2 మరియు 91:7.

39. ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు.

40. అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అల్-ముదథ్థిర్సూరా అల్-ఇన్సాన్ ›