తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-వాఖియహ్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 56వ సూరా, 96 ఆయతులు, 534వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అర్-రహ్మాన్సూరా అల్-హదీద్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,[1]

[1] అనివార్య సంఘటన అంటే, అంతిమ ఘడియ, పునరుత్థాన దినం.

2. అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.

3. అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది[1].

[1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను అనుసరించిన వారు పైకెత్తబడతారు. వాటిని తిరస్కరించిన వారు హీనపరచబడతారు.

4. భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు;

5. మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు;

6. అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు;

7. మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు.

8. ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)![1]

[1] కుడిపక్షం వారంటే తమ కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడేవారు. అంటే స్వర్గానికి అర్హులైనవారు. చూడండి, 74:39.

9. మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)![1]

[1] వారు (ఎడమ) పక్షంవారు అంటే తమ కర్మపత్రాలు ఎడమ చేతిలో ఇవ్వబడినవారు. అంటే నరకానికి అర్హులైన వారు. చూడండి, 90:19.

10. మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.

11. అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.

12. వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.

13. మొదటి తరాల వారిలో నుండి చాలా మంది;

14. మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.

15. (బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;

16. ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.[1]

[1] చూడండి, 15:47.

17. వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.

18. (మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!

19. దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.

20. మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి.

21. మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.[1]

[1] 'నేను నా సద్వర్తనులైన దాసుల కొరకు సిద్ధ పరచి ఉంచిన దాన్ని ఇంతవరకూ ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు ఏ మానవ హృదయము (మనస్సు) కూడా ఊహించలేదు.' (బు'ఖారీ, ముస్లిం, తిర్మిజీ - అబూ హురైరహ్ కథనం, ఇంకా చూడండి, 32:17).

22. మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);

23. దాచబడిన ముత్యాల వలే!

24. ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!

25. అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.[1]

[1] ప్రాపంచిక జీవితంలో పోట్లాటలు, ఏవగింపులు, అసహ్యాలు స్వంత అన్నదమ్ముల మధ్య కూడా తప్పవు. కాని స్వర్గవాసుల మధ్య ఇటువంటి వ్యర్థపు మాటలు ఎన్నడూ జరుగవు.

26. "శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప![1]

[1] చూడండి, 19:62.

27. మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)!

28. వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య![1]

[1] చూడండి, 53:14.

29. మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు;

30. మరియు వ్యాపించి ఉన్న నీడలు,[1]

[1] చూడండి, 4:57.

31. మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు;

32. మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు;

33. ఎడతెగకుండా మరియు నిషేధించబడకుండా;

34. మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.[1]

[1] కొందరు వ్యాఖ్యాతలు: 'ఫురుషిన్' - శబ్దానికి, భార్యలు అని అర్థమిచ్చారు. మరియు 'మర్ ఫూ'అతిన్' అంటే మంచి, పెద్ద స్థానాలు గలవారు అని.

35. నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;

36. మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;[1]

[1] సద్వర్తనులైన స్త్రీలు చనిపోయినప్పుడు ఎంత వృద్ధులుగా ఉన్నా, పునరుత్థాన దినమున యవ్వన కన్యలుగా లేపబడతారు. వారు నిత్యం యవ్వన స్థితిలోనే ఉంటారు.

37. వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు);[1]

[1] చూడండి, 38:52 మరియు 78:33.

38. కుడిపక్షం వారి కొరకు.

39. అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;

40. మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు.

41. ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?

42. వారు దహించే వేడిగాలిలో మరియు సలసలకాగే నీటిలో;

43. మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు).

44. అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;

45. నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి;

46. మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి;

47. మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?

48. మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?

49. వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ!

50. వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు.

51. ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!

52. మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు.[1]

[1] చూడండి, 38:52 మరియు 78:33.

53. దానితో కడుపులు నింపుకుంటారు.

54. తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు.

55. వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు.

56. తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే!

57. మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?

58. ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?

59. ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము?

60. మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;

61. మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.

62. మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?

63. మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?

64. మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము?

65. మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు."

66. (మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము!

67. కాదు, కాదు, మేము దరిద్రులమయ్యాము! అని.

68. ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?

69. మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము?

70. మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు?

71. మీరు రాజేసే అగ్నిని గమనించారా?

72. దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?[1]

[1] అంటే అన్ని రకాల ఇంధనం, బొగ్గు, పెట్రోలు, మొదలైనవి చెట్ల నుంచే వస్తాయని.

73. మేము దానిని, (నరకాగ్నిని) గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.[1]

[1] ఇక్కడ పేర్కొనబడినది ఇహలోకపు అగ్ని, అది నరకాగ్నిని గుర్తు చేస్తుంది. 'హదీస్'లో మూడు వస్తువుల నుండి ఎవ్వరినీ ఆపకూడదని ఉంది: అవి నీరు, పచ్చిక (పశువుల మేత) మరియు అగ్ని, (అబూ-దావూద్, సునన్ ఇబ్నె-మాజా - ఇబ్నె-కసీ'ర్ వ్యాఖ్యానం).

74. కావున సర్వోత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.

75. ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.

76. మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!

77. నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.

78. సురక్షితమైన[1] గ్రంథంలో ఉన్నది.

[1] అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్ లో

79. దానిని[1] పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.

[1] దానిని అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్ మరియు పరిశుద్ధులు అంటే దైవదూత, అని కొందరి అభిప్రాయం. మరికొందరు దానిని - అంటే - ఖుర్ఆన్, అని అంటారు. దానిని ఆకాశం నుండి అవతరింపజేస్తున్న వారు కేవలం దైవదూతలే! సత్యతిరస్కారులు అపోహలు లేపినట్లు, షైతానులు కాదు. ఎందుకంటే వారు దానిని తాకలేరు. చూడండి, 85:21-22.

80. ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది.

81. ఏమీ? మీరు ఈ సందేశాన్ని[1] తేలికగా తీసుకుంటున్నారా?

[1] సందేశమంటే ఇక్కడ ఖుర్ఆన్ అని హదీస్ లో పేర్కొనబడింది.

82. మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?[1]

[1] పైది ఇబ్నె-కసీ'ర్ తాత్పర్యం. ము'హమ్మద్ జునాగఢి గారి తాత్పర్యం ఈ విధంగా ఉంది: 'మరియు మీరు తిరస్కరిస్తూఉండటమే మీ జీవనోపాధిగా చేసుకుంటున్నారా?'

83. అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?

84. మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.

85. మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.[1]

[1] ఇక్కడ కొందరు అల్లాహ్ (సు.తా.) తన జ్ఞానంతో మీ దగ్గరలో ఉన్నాడనీ, మరికొందరు ఇక్కడ దాని భావం ప్రాణం తీసే దైవదూతలనీ వ్యాఖ్యానించారు.

86. ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే;

87. మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?

88. కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే![1]

[1] సూరహ్ మొదట్లో పేర్కొన్న మూడు రకాల వారిలో వీరు మొదటి రకానికి చెందినవారు.

89. అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి.

90. మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో![1]

[1] వీరు రెండవ రకానికి చెందినవారు.

91. అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది).

92. మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో![1]

[1] వీరు మూడవ రకానికి చెందినవారు వీరు అస్'హాబ్ మష్అమ అని, ఈ సూరహ్ మొదట్లో పేర్కొనబడ్డారు.

93. అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.

94. మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.

95. నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం!

96. కావున సర్వోత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.[1]

[1] 'హదీస్' లో వచ్చింది: రెండు పదాలు అల్లాహ్ (సు.తా.) కు ఎంతో ప్రియమైనవి. ఉచ్చరించటానికి సులభమైనవి మరియు ప్రతిఫలం రీత్యా బరువైనవి. "సుబ్ హానల్లాహి వ బి'హమ్ ది హీ, సుబ్ హానల్లాహిల్ 'అ'జీమ్!" ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అర్-రహ్మాన్సూరా అల్-హదీద్ ›