తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అద్-దుఖ్ఖాన్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 44వ సూరా, 59 ఆయతులు, 496వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అజ్-జుఖ్రుఫ్సూరా అల్-జాథియహ్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. హా - మీమ్[1].

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

2. స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా![1]

[1] చూడండి, 12:1.

3. నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము.[1] నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము.[2]

[1] ఖుర్ఆన్ అవతరింపజేయబడిన రాత్రి లైలతుల్ ఖద్ర్ శుభవంతమైన రాత్రి. చూడండి, సూరహ్ అల్-ఖద్ర్ (97). ఇంకా చూడండి 2:185 ఈ రాత్రి రమ'దాన్ నెల చివరి 10 రోజులలోని బేసి రాత్రులలో ఒకటి అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. 1) ఈ రాత్రిలో ఖుర్ఆన్ అవతరింపజేయబడింది. 2) ఈ రాత్రిలోనే దైవదూత (అలైహిమ్ స.)లు మరియు పవిత్ర ఆత్మ (జిబ్రీల్ 'అ.స.) దిగి వస్తారు. 3) ఈ రాత్రిలో, రాబోయే సంవత్సరంలో జరగబోయే విషయాల నిర్ణయం జరుగుతుంది. 4) ఈ రాత్రిలో చేసే ఆరాధన ('ఇబాదహ్) వేయి నెలల (83 సంవత్సరాల 4 నెలల) ఆరాధన కంటే ఉత్తమమైనది. ఈ రాత్రిలోనే ఖుర్ఆన్ ఏడవ ఆకాశంపై ఉన్న లౌ'హె మ'హ్ ఫూ"జ్ నుండి భూలోకపు ఆకాశంపై ఉన్న బైతుల్ 'ఇజ్జహ్ లోకి మొత్తం ఒకేసారి దింపబడింది. ఆ తరువాత 23 సంవత్సరాలలో క్రమక్రమంగా దైవప్రవక్త ('స'అస) మీద అవతరింపజేయబడింది. [2] ఖుర్ఆన్ అవతరణ ప్రజలకు మంచి చెడును బోధించటానికి జరిగింది.

4. దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది;

5. మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము.

6. నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.

7. భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే!

8. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు.[1]

[1] చూడండి, 7:158. ఈ ఆయత్ పోలిన ఆయత్.

9. అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు).

10. కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు!

11. అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష.

12. (అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసులమవుతాము."

13. ఇక హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు;

14. అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!"[1]

[1] చూడండి, 16:103 మరియు 25:4.

15. వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తాము. నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు.

16. మేము మహా పట్టు పట్టే (కఠినంగా శిక్షించే) రోజు, నిశ్చయంగా, మేము ప్రతీకారం తీర్చుకుంటాము.

17. మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు.

18. (అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించండి.[1] నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.

[1] 'ఇబాదల్లాహ్: అంటే ఇక్కడ మూసా ('అ.స.) జాతివారైన బనీ ఇస్రాయీ'ల్ తెగవారు.

19. మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను.

20. మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి.

21. ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!"

22. చివరకు అతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!"

23. (అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు.

24. మరియు సముద్రాన్ని (చీలిన స్థితిలోనే) నిశ్చలంగా వదలిపెట్టు.[1] నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!"

[1] చూడండి, 26:63-66. రహ్వాన్: అంటే ప్రశాంతమైనది లేక తడిలేనిది. జౌహరీ (ర'హ్మ) దీనిని ప్రశాంతంగా చీలిపోయి ఉన్నది, అని వివరించారు.

25. వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు;

26. మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను;

27. మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా!

28. ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము.

29. కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.

30. మరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము -

31. ఫిర్ఔన్ నుండి. నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారిలో అహంకారి (నిరంకుశుడు).

32. మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము.[1]

[1] ఎందుకంటే ఆ కాలంలో కేవలం బనీ-ఇస్రాయీ'ల్ వారు మాత్రమే ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించేవారు. మిగతా వారంతా బహుదైవారాధకులుగా ఉన్నారు. చూడండి, 15:23.

33. మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది.

34. నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు:

35. "వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము.

36. మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి!"[1]

[1] చూడండి, 43:22-23.

37. వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు[1] మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!

[1] తుబ్బ'అ అంటే సబా' ప్రాంతంలో నివసించే 'హిమ్ యార్ తెగకు చెందినవారు. వారి రాజుల బిరుదు తుబ్బ'అ ఏ విధంగానైతే రోమన్ రాజులు సీజర్ అనబడేవారో! వారు చాలా కాలం దక్షిణ 'అరేబియా మీద రాజరికం చేశారు. వారిని, అబిసీనియా వారు (Abyssinians) 4వ క్రీ.శ.లో అంతమొందించారు. చూడండి, 50:14. వారు సత్యతిరస్కారులు.

38. మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.[1]

[1] ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 38:27, 23:115-116, 15:85 మరియు 21:16.

39. మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు.[1]

[1] చూడండి, 10:5.

40. నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం.[1]

[1] చూడండి, 77:13.

41. ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు.[1]

[1] చూడండి, 23:101, 70:10. మౌలా: అంటే "దగ్గరి బంధువు" అని కూడా తాత్పర్యమిచ్చారు.

42. అల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

43. నిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షం (ఫలం);

44. పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది;

45. మరిగే నూనె (సీసం) వలే[1], అది వారి కడుపులో మరుగుతుంది;

[1] అల్-ముహ్ లు: కరిగిన రాగి అని కూడా కొందరు వ్యాఖ్యానించారు.

46. సలసల కాగే నీటిలాగా!

47. (ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్చండి;

48. ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి.

49. దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!"

50. నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం!

51. నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు.

52. ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య.

53. వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.[1]

[1] చూడండి, 18:31 మరియు 35:33

54. ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.[1]

[1] 'హూరున్: చూడండి, 56:22, 52:20, 55:56, 37:48, 37:52. వారి కళ్ళ నలుపు మరియు తెలుపు ఎంతో అందంగా ఉంటాయి. వారిని చూసినవారు వారి అందానికి ముగ్దులైపోతారు.

55. వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు.[1]

[1] చూచూడండి, 43:73.

56. వారక్కడ మరణాన్ని[1] ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;

[1] 'స'హీ'హ్ 'హదీస్' లో ఉంది: మృత్యువును ఒక గొర్రె ఆకారంలో తెచ్చి స్వర్గనరకాల మధ్య జిబ్హ్ చేస్తారు. మరియు ఈ విధంగా ప్రకటిస్తారు: 'ఓ స్వర్గవాసులారా! ఇక మీకు మృత్యువు లేదు; మీరు కలకాలం స్వర్గంలో ఉంటారు. ఓ నరకవాసులారా! మీకు సదా నరకవాసమే. మీకు మృత్యువు లేదు." (స.'బు'ఖారీ, ముస్లిం.) ఇంకా చూడండి, 19:39, 37:58-59.

57. నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం!

58. అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని).[1]

[1] చూడండి, 19:97.

59. కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అజ్-జుఖ్రుఫ్సూరా అల్-జాథియహ్ ›