ముస్హఫ్లో 36వ సూరా, 83 ఆయతులు, 440వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. యా సీన్![1][2]
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్నోట్ చూడండి. [2] యా-సీన్, ఈ రెండు అక్షరాలు కూడా, ఇతర అక్షరాల వలె ముఖత్తఆత్ లలోనివే! కావున వీటి నిజ అర్థం ఎవరికీ తెలియదు. కొందరు దీని అర్థం: 'ఓ మానవుడా!' అని అంటారు. మరికొందరు: 'ఇది దైవప్రవక్తను సంబోధిస్తుంది' అని అంటారు.
2. వివేకంతో నిండి ఉన్న ఖుర్ఆన్ సాక్షిగా!
3. (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు సందేశహరులలో ఒకడవు.[1]
[1] మక్కా ముష్రికులు: 'నీవు దైవప్రవక్తవు కావు!' అని ము'హమ్మద్ ('స'అస) తో అనేవారు. చూడండి, 13:43. దానికి జవాబుగా ఈ ఆయత్ అవతరింపజేయబడింది.
4. (నీవు) ఋజుమార్గంపై ఉన్నావు.
5. ఇది (ఈ ఖుర్ఆన్) సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది.[1]
[1] చూడండి, 34:50.
6. ఏ జాతి వారి తండ్రి తాతలు హెచ్చరించబడలేదో, అందువల్ల వారు నిర్లక్ష్యంలో పడి ఉన్నారో, ఆ జాతి వారిని హెచ్చరించటానికి.[1]
[1] చూడండి, 6:131-132.
7. వాస్తవానికి వారిలో చాలా మంది విషయంలో మా వాక్కు నిజమై పోయింది, కావున వారు విశ్వసించరు.[1]
[1] 'నేను జిన్నాతులు మరియు మానవులతో నరకాన్ని నింపుతాను!' (32:13, 38:85).
8. నిశ్చయంగా, మేము వారి మెడలలో పట్టాలు వేశాము.[1] అవి వారి గడ్డాల వరకు వున్నాయి. కావున వారి తలలు నిక్కి వున్నాయి.
[1] చూడండి, 13:5 మరియు 34:33.
9. మరియు మేము వారి ముందు ఒక అడ్డు (తెరను) మరియు వారి వెనుక ఒక అడ్డు (తెర)ను నిలబెట్టాము. మరియు మేము వారిని కప్పి వేశాము అందువల్ల వారు ఏమీ చూడలేరు.
10. మరియు నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించక పోయినా, వారికి సమానమే, వారు విశ్వసించరు!
11. నిశ్చయంగా, ఎవడైతే హితబోధను అనుసరిస్తూ, అగోచరుడైన కరుణామయునికి భయపడతాడో! అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం (స్వర్గం) లభిస్తుందనే శుభవార్తను అందజేయి.
12. నిశ్చయంగా, మేము మృతులను సజీవులుగా చేస్తాము. మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసి పెడుతున్నాము.[1] మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో నమోదు చేసి ఉంచాము.
[1] ఎవడైతే ఇస్లాంలో ఒక మంచి పనిని ప్రారంభిస్తాడో అతనికి అతనికి దాని పుణ్యఫలితం లభిస్తుంది. అంతేగాక, అతని తరువాత ఇతరులు దానిపై నడిస్తే - ఆ అనుసరించే, వారి పుణ్యంలో ఎట్టి తగ్గింపు లేకుండా - ఆ పుణ్యం కూడా అతనికి లభిస్తూ ఉంటుంది. ఇక ఒకడు చెడ్డపని ప్రారంభిస్తే అతనికి దాని శిక్ష కాక, దానిపై నడిచే వారందరి పాపాల శిక్ష కూడా విధించబడుతుంది. ('స'హీ'హ్ ముస్లిం). ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని కర్మలు ఆగిపోతాయి. మూడు విషయాలు తప్ప. 1) జ్ఞానం - దేనినైతే ఇతరులు లాభం పొందుతూ ఉంటారో! 2) పుణ్యాత్ములైన సంతానం - ఎవరైతే చనిపోయిన తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారో! 3) 'సదఖహ్ జారియహ్ - దేనితోనైతే అతడు మరణించిన తరువాత కూడా, ప్రజలు లాభం పొందుతూ ఉంటారో! ('స'హీ'హ్ ముస్లిం).
13. వారికి సందేశహరులు వచ్చినప్పటి ఆ నగరవాసుల[1] గాథను వారికి ఒక ఉదాహరణగా వినిపించు;
[1] ఈ నగరం అంటాకియా (Antakiya) కావచ్చని కొందరు వ్యాఖ్యాతలు అన్నారు.
14. మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరినీ అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరిచాము. అప్పుడు వారు, వారితో: "నిశ్చయంగా, మేము (మీ వద్దకు పంపబడిన) సందేశహరులం" అని అన్నారు.
15. (దానికి ఆ నగరవాసులు) ఇలా అన్నారు: "మీరు కేవలం మా వంటి మానవులే మరియు అనంత కరుణామయుడు మీపై ఏదీ (సందేశాన్నీ) అవతరింపజేయలేదు. మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు!"[1]
[1] చూడండి, 6:91 మరియు 34:31.
16. (ఆ ప్రవక్తలు) అన్నారు: "మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము!
17. మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే!"
18. (ఆ నగరవాసులు) అన్నారు; "నిశ్చయంగా, మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది."
19. (ఆ ప్రవక్తలు) అన్నారు: "మీ అపశకునం మీ వెంటనే ఉంది.[1] మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరి పోయిన ప్రజలు."[2]
[1] చూడండి, 17:13. [2] చూడండి, 10:12.
20. ఆ నగరపు దూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈ సందేశహరులను అనుసరించండి!
21. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరని వారిని (ఈ సందేశహరులను) అనుసరించండి! వారు సన్మార్గంలో ఉన్నారు.
22. "మరియు నన్ను సృష్టించిన ఆయనను నేనెందుకు ఆరాధించకూడదూ? మరియు మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు."
23. ఏమీ? ఆయనను వదలి నేను ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకోవాలా? ఒకవేళ ఆ కరుణామయుడు నాకు హాని చేయదలచుకుంటే, వారి సిఫారసు నాకు ఏ మాత్రం ఉపయోగ పడదు మరియు వారు నన్ను కాపాడనూలేరు.
24. అలా చేస్తే నిశ్చయంగా, నేను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి పోయిన వాడిని అవుతాను.
25. నిశ్చయంగా, నేను మీ ప్రభువును విశ్వసిస్తున్నాను, కావున మీరు నా మాట వినండి!"
26. (అతనిని వారు చంపిన తరువాత అతనితో) ఇలా అనబడింది: "నీవు స్వర్గంలో ప్రవేశించు." అతడు ఇలా అన్నాడు: "అయ్యో! నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేది!
27. నా ప్రభువు నన్ను క్షమించాడు మరియు నన్ను గౌరవనీయులలోకి చేర్చాడు అన్న విషయం!"
28. మరియు ఆ తరువాత అతని జాతి వారి మీదకు, మేము ఆకాశం నుండి ఏ సైన్యాన్నీ పంపలేదు. అసలు మాకు సైన్యాన్ని పంపే అవసరమే ఉండదు!
29. అది కేవలం ఒక పెద్ద ధ్వని[1] మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతం చేయబడ్డారు.
[1] 'సయ్'హతున్: ధ్వని, అరుపు, గర్జన లేక శబ్దం. ఇంకా చూడండి, 36:49, 53, 38:15.
30. ఆ దాసుల గతి ఎంత శోచనీయమయినది! వారి వద్దకు ఏ సందేశహరుడు వచ్చినా, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండలేదు.
31. ఏమీ? వారు చూడలేదా (వారికి తెలియదా)? వారికి ముందు మేము ఎన్నో తరాలను నాశనం చేశామని? నిశ్చయంగా, వారు (వారి పూర్వీకులు) ఎన్నటికీ వారి వద్దకు తిరిగి రాలేదు.
32. కాని వారందరినీ కలిపి ఒకేసారి, మా ముందు హాజరు పరచడం జరుగుతుంది.
33. మరియు వారి కొరకు సూచనగా జీవం లేని ఈ భూమియే ఉంది. మేము దీనికి ప్రాణం పోసి, దీని నుండి ధాన్యం తీస్తాము, దాన్ని వారు తింటారు.
34. మేము దీనిలో ఖర్జూరపు మరియు ద్రాక్ష వనాలను పెంచాము మరియు దీనిలో ఊటలను ప్రవహింపజేశాము.
35. వారు దీని ఫలాలను తినటానికి; మరియు ఇదంతా వారి చేతులు చేసింది కాదు. అయినా వారు కృతజ్ఞతలు తెలుపరా?
36. భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన ఆయన (అల్లాహ్) లోపాలకు అతీతుడు.[1]
[1] సృష్టిలో నున్న ప్రతి వస్తువు జతలలో ఉన్నది. అవి జీవులు కానీ, నిర్జీవులు కానీ. జీవరాసులలో మరియు వృక్షరాసులలో ఆడ-మగ; చీకటి-వెలుగులు, చలి-వేడి, విద్యుచ్ఛక్తి మరియు అయస్కాంతాలలో ఉన్న ధన (+) మరియు ఋణ (-) ఆవేశాలు, ఉత్తర-దక్షిణ ధ్రువాలు మొదలైనవి. కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే ఏకైకుడు.
37. మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి; మేము దానిపై నుండి పగటిని (వెలుగును) తొలగించినప్పుడు, వారిని చీకటి ఆవరించుకుంటుంది.
38. మరియు సూర్యుడు తన నిర్ణీత గమ్యస్థానం (కాలం) వైపునకు పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియమావళి.
39. మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జూరపు మట్ట వలే అయిపోతాడు.
40. చంద్రుణ్ణి అందుకోవటం సూర్యుడి తరం కాదు. మరియు రాత్రి పగటిని అధిగమించ జాలదు. మరియు అవన్నీ తమ తమ కక్ష్యలలో సంచరిస్తూ ఉంటాయి.
41. వారికి మరొక సూచన ఏమిటంటే, నిశ్చయంగా, మేము వారి సంతతిని (నూహ్ యొక్క) నిండు నావ లోనికి ఎక్కించాము.
42. మరియు మేము వారు ఎక్కి ప్రయాణం చేయటానికి, ఇటువంటి వాటిని ఎన్నో సృష్టించాము.[1]
[1] చూడండి, 16:8.
43. మరియు మేము కోరినట్లయితే, వారిని ముంచి వేసే వారము; అప్పుడు వారి కేకలు వినేవాడెవడూ ఉండడు మరియు వారు రక్షింపబడనూ లేరు -
44. మేము కరుణిస్తే తప్ప - మరియు మేము కొంత కాలం వరకు వారికి వ్యవధినిస్తే తప్ప!
45. మరియు వారితో: "మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న దానికీ (పరలోక శిక్షకూ) భీతిపరులై ఉండండి,[1] బహుశా మీరు కరుణింప బడవచ్చు!" అని అన్నప్పుడు, (వారు లక్ష్యం చేయటం లేదు).
[1] చూడండిమా బైన అయ్ దీకుమ్ వ మా 'ఖల్ ఫకుమ్: పైన ఇచ్చిన తాత్పర్యం నోబుల్ ఖుర్ఆన్ ను అనుసరించి ఉంది. ము'హమ్మద్ జూనాగఢి గారి తాత్పర్యం ఇలా ఉంది: 'మీ వెనుకా ముందు సంభవించే పాపాల నుండి కాపాడుకోండి.'
46. మరియు వారి ప్రభువు సూచనలలో నుండి, వారి వద్దకు ఏ సూచన వచ్చినా, వారు దాని నుండి ముఖం త్రిప్పుకోకుండా ఉండలేదు.
47. మరియు వారితో: "అల్లాహ్ మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేయండి." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: "ఏమీ? అల్లాహ్ కోరితే, తానే తినిపించగల వారికి, మేము తినిపించాలా? మీరు కేవలం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలోనే పడి ఉన్నారు."
48. వారు ఇంకా ఇలా అంటారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం (పునరుత్థానం) ఎప్పుడు పూర్తి కానున్నది?"
49. వారు నిరీక్షిస్తున్నది కేవలం ఒక పెద్ద ధ్వని[1] కొరకే. మరియు వారు వాదులాడుకుంటూ ఉండగానే, అది వారిని చిక్కించుకుంటుంది.
[1] అంటే అతస్మాత్తుగా ఊదబడే పునరుత్థానదినపు బాకా (కొమ్ము) ధ్వని, అరుపు, గర్జన లేక శబ్దం. దీనిని మొదటి బాకా లేక నఫ్'ఖతుల్ ఫజ'అ అంటారు. దీని తరువాత రెండవ బాకా ఊదబడుతుంది. దానిని నఫ్'ఖతు 'స్స'అఖ్, అంటారు. అప్పుడు అల్లాహ్ (సు.తా.) తప్ప సర్వజీవరాసులు మరణిస్తారు. ఇంకా చూడండి, 36:29, 53; 38:15.
50. వారు ఏ విధమైన వీలునామా కూడా వ్రాయలేరు మరియు తమ కుటుంబం వారి వద్దకు కూడా తిరిగి పోలేరు.
51. మరియు (మరొకసారి) బాకా ఊదబడినప్పుడు, వారంతా గోరీల నుండి (లేచి) తమ ప్రభువు వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తారు.[1]
[1] కొందరు వ్యాఖ్యాతలు దీనిని రెండవ బాకా అని, మరికొందరు దీనిని మూడవ బాకా అంటే నఫ్'ఖతుల్-బ'అసి 'వన్నుషూర్ అని అంటారు. ఇది ఊదబడగానే గోరీలలోని వారంతా లేచి వస్తారు. (ఇబ్నె-కసీ'ర్).
52. వారంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు?" (వారితో అనబడుతుంది): "ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం. మరియు సందేశహరులు సత్యమే పలికారు!"
53. అది కేవలం ఒక పెద్ద ధ్వని[1] మాత్రమే అయి ఉంటుంది! వెంటనే వారంతా మా ముందు హాజరు చేయబడతారు!
[1] ఇది పునరుత్థాన దినమున ఇస్రాఫీల్ ('అ.స.) ఊదే బాకా ధ్వని.
54. ఆ రోజు ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరుగదు. మరియు మీ కర్మలకు తగినది తప్ప, మరే ప్రతిఫలమివ్వబడదు.
55. నిశ్చయంగా, ఆ రోజు స్వర్గవాసులు సుఖసంతోషాలలో నిమగ్నులై ఉంటారు.
56. వారు మరియు వారి సహవాసులు (అజ్వాజ్), చల్లని నీడలలో, ఆసనాల మీద ఆనుకొని హాయిగా కూర్చొని ఉంటారు.[1]
[1] చూడండి, 4:57, 18:31 మరియు 55:54.
57. అందులో వారికి ఫలాలు మరియు వారు కోరే వన్నీ ఉంటాయి.
58. "మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి.[1]
[1] చూడండి, 5:16.
59. ఇంకా (ఇలా అనబడుతుంది): "ఓ అపరాధులారా! ఈనాడు మీరు వేరయి పొండి."[1]
[1] చూడండి, 30:14, 43.
60. "ఓ ఆదమ్ సంతతివారలారా: 'షైతానును ఆరాధించకండి' అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!"[1]
[1] చూడండి, 19:44.
61. "మరియు మీరు నన్నే ఆరాధించండి. ఇదే ఋజుమార్గమనీ!"
62. "మరియు వాస్తవానికి వాడు (షైతాన్) మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ? మీకు తెలివి లేక పోయిందా?"
63. "మీకు వాగ్దానం చేయబడిన ఆ నరకం ఇదే!"
64. "మీరు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నందుకు, ఈ రోజు దీనిలో ప్రవేశించండి (కాలండి)."
65. ఆ రోజు మేము వారి నోళ్ళ మీద ముద్ర వేస్తాము.[1] మరియు వారేమి అర్జించారో వారి చేతులు మాతో చెబుతాయి మరియు వారి కాళ్ళు మా ముందు సాక్ష్యమిస్తాయి.
[1] ఎందుకంటే మొదట వారు తాము చేసిన షిర్కును తిరస్కరిస్తారు. చూడండి, 6:23.
66. మరియు మేము కోరినట్లయితే, వారి దృష్టిని నిర్మూలించే వారము, అప్పుడు వారు దారి కొరకు పెనుగులాడే వారు, కాని వారు ఎలా చూడగలిగే వారు?[1]
[1] చూడండి, 2:20.
67. మరియు మేము కోరినట్లయితే, వారిని వారి స్థానంలోనే రూపాన్ని మార్చి ఉంచే వారం, అప్పుడు వారు ముందుకూ పోలేరు మరియు వెనుకకూ మరలలేరు.
68. మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో, అతనిని సృష్టిలో తలక్రిందులుగా (బలం నుండి బలహీనతకు) మరలిస్తాము. ఏమీ? వారు ఇది కూడా గ్రహించలేరా?[1]
[1] చూడండి, 30:54, 16:70 మరియు 22:5.
69. మరియు మేము అతనికి (ముహమ్మద్ కు) కవిత్వం నేర్పలేదు.[1] మరియు అది అతనికి శోభించదు కూడా! ఇది కేవలం ఒక హితోపదేశం మరియు స్పష్టమైన పఠన గ్రంథం (ఖుర్ఆన్) మాత్రమే.[2]
[1] మక్కా ముష్రికులు దైవప్రవక్త ('స'అస) ను వివిధ ఆరోపణలతో పీడించేవారు. వాటిలో ఒకటి ఇతను ('స'అస) కవిత్వం చెబుతున్నాడని. దానికి అల్లాహ్ (సు.తా.) ఇక్కడ జవాబిస్తున్నాడు: ఒకవేళ ఇది కవిత్వం అయితే మీరు దీని వంటి ఒక్క సూరహ్ నైనా రచించి తీసుకురండని. కాని దానిని ఎవ్వరూ ఈ రోజు వరకు పూర్తి చేయలేక పోయారు. ఇంకా చూడండి, 26:224-226. [2] చూడండి, 15:1
70. బ్రతికి వున్న ప్రతివానికి హెచ్చరిక చేయటానికి మరియు సత్యతిరస్కారులపై (శిక్షను గురించిన) మా వాక్కు నిజం కావటానికి!
71. ఏమీ, వారికి తెలియదా? నిశ్చయంగా, మేము వారి కొరకు మా చేతులతో పశువులను సృష్టించి, తరువాత వాటిపై వారికి యాజమాన్యం ఇచ్చామని?
72. మరియు వాటిని, వారికి స్వాధీనపరిచాము. కావున వాటిలో కొన్నిటిపై వారు స్వారీ చేస్తారు, మరికొన్నిటిని (వాటి మాంసాన్ని) వారు తింటారు.
73. మరియు వాటిలో వారికి ఎన్నో ప్రయోజనాలు మరియు పానీయాలు (పాలు) ఉన్నాయి. అయినా, వారెందుకు కృతజ్ఞతలు చూపరు?
74. మరియు వారు అల్లాహ్ ను వదలి, ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు.[1] బహుశా వారి వలన తమకు సహాయం దొరకుతుందేమోననే ఆశతో!
[1] అంటే విగ్రహాలు, కల్పితదైవాలు, అవతారాలుగా భావించబడే మానవులు, సాధులు, సన్యాసులు, ప్రవక్తలు, షై'తాన్ మరియు దైవదూతలూ లేక ధనసంపత్తులు, బలం, శక్తి, అదృష్టం, శకునం మొదలైనవి. వీటినే వారు దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారు.
75. వారు (ఆ దైవాలు), వీరికి (తమను ఆరాధించేవారికి) ఎలాంటి సహాయం చేయలేరు. అయినా! వీరు (సత్యతిరస్కారులు) వారి (ఆ దైవాల) కొరకు సైన్యం మాదిరిగా సర్వసన్నద్ధులై ఉన్నారు.[1]
[1] ఈ ఆయత్ యొక్క మరొక తాత్పర్యం ఈ విధంగా కూడా ఉంది: "వారు (ఆ దైవాలు), వీరికెలాంటి సహాయం చేయలేరు. కాని వారు (ఆ దైవాలు పునరుత్థాన దినమున తమను ఆరాధించిన వారికి) విరుద్ధ భటులుగా హాజరు చేయబడతారు." (ఇబ్నె-కసీ'ర్)
76. కావున (ఓ ముహమ్మద్!) వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి! మాకు, వారు దాచేవి మరియు వెలిబుచ్చేవీ అన్నీ బాగా తెలుసు.
77. ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా, మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు?[1]
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 16:4.
78. మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరచిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?"
79. ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు ప్రతి సృష్టిని గురించి బాగా తెలుసు."
80. ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు, తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు.
81. ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించినవాడు, వారి లాంటి వారిని (మానవులను) మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు.[1]
[1] చూడండి, 40:57, 46:33, 17:99.
82. నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే! అది అయిపోతుంది.
83. కావున, ఎవరి చేతిలోనైతే ప్రతిదాని సర్వాధికారం ఉందో, ఆయన (అల్లాహ్) సర్వలోపాలకు అతీతుడు మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.