తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అస్-సజ్దహ్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 32వ సూరా, 30 ఆయతులు, 415వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా లుఖ్మాన్సూరా అల్-అహ్'జాబ్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. అలిఫ్-లామ్-మీమ్[1]

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

2. నిస్సంకోచంగా, ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వలోకాల ప్రభువు తరఫు నుండియే ఉంది.

3. ఏమీ? వారు (అవిశ్వాసులు): "ఇతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా?[1] అలా కాదు! వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవ్వరూ రాని జాతి వారికి నీవు హెచ్చరిక చేయటానికి, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!

[1] అలాంటప్పుడు వారిని ఇలాంటి గ్రంథాన్ని రచించి తెమ్మను? అనే ప్రశ్నకు చూడండి, 17:88, 52:34. ఇలాంటి 10 సూరాహ్ లనైనా రచించి తెమ్మను? అనే ప్రశ్నకు, 11:13. ఇలాంటి ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మను? అనే ప్రశ్నకు, 2:23, 10:38.

4. అల్లాహ్, ఆయనే ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా ఆరు దినములలో (అయ్యామ్ లలో)[1] సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు మరొక సంరక్షకుడు గానీ, సిఫారసు చేసేవాడు గానీ ఎవ్వడూ లేడు, అయినా మీరు హితబోధ గ్రహించరా?

[1] చూడండి, 7:54 వ్యాఖ్యానం 1.

5. ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున,[1] ఆయన వద్దకు పోయి చేరుతుంది; దాని (ఆ దినపు) పరిమాణం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలు.

[1] అంటే ఇది పునరుత్థానదినం అని, కొందరు వ్యాఖ్యాతలు బోధించారు. అది చాలా కష్టతరమైన దినం కావటం వల్ల వేయి సంవత్సరాల వలే కనిపిస్తుంది. చూడండి, 22:47లో కూడా: "…మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క వద్ద ఒక్క దినం, మీ లెక్కల ప్రకారం వేయి సంపత్సరాలకు సమానమైనది." అని ఉంది. కాని 70:4లో: "యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్ 'అ.స.) ఆయన (సు.తా.) వద్దకు అధిరోహిస్తారు." అని, ఉంది. అంటే వారు అంత తీవ్రంగా ప్రయాణం చేస్తారన్నమాట.

6. ఆయన (అల్లాహ్) యే అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

7. ఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తమరీతిలో చేశాడు. మరియు మానవ సృష్టిని మట్టితో ప్రారంభించాడు.[1]

[1] చూడండి, 23:12.

8. తరువాత అతని సంతతిని ఒక అధమమైన ద్రవపదార్థపు సారంతో (వీర్యంతో) చేశాడు.

9. ఆ తరువాత అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది, అతనిలో తన (నుండి) ప్రాణం (ఆత్మ) ఊదాడు.[1] మరియు మీకు వినేశక్తిని, చూసేశక్తిని మరియు హృదయాలను (అర్థం చేసుకునే శక్తిని) ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువ!

[1] చూడండి, 15:29, 38:72.

10. మరియు వారు (అవిశ్వాసులు) అంటున్నారు: "ఏమీ? మేము నశించి, మట్టిలో కలిసి పోయినా, మేము మళ్ళీ క్రొత్తగా సృష్టించబడతామా?" అది కాదు! వారు తమ ప్రభువుతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తున్నారు.[1]

[1] చూడండి, 13:5.

11. వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు."

12. మరియు (పునరుత్థాన దినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏ విధంగా తమ తలలు వంచుకొని నిలబడి ఉంటారో, నీవు చూడగలిగితే! వారు: "ఓ మా ప్రభూ! మేమిప్పుడు చూశాము మరియు విన్నాము, కావున మమ్మల్ని తిరిగి (భూలోకానికి) పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము, నిశ్చయంగా, మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది." అని అంటారు.

13. మరియు మేము కోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండేవారము.[1] కాని, నేను: "నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్ని నింపివేస్తాను." అని పలికిన, నా మాట సత్యమయ్యింది.[2]

[1] చూడండి, 26:4. అల్లాహ్ (సు.తా.) ఎవ్వరినీ సన్మార్గం మీద ఉండటానికి బలవంతం చేయడు కాని మార్గదర్శకత్వం చేస్తాడు. దానిని అనుసరించనివాడు శిక్షకు గురి అవుతాడు. [2] ఇటువంటి వాక్యాలకు చూడండి, 7:18 మరియు 11:119.

14. కావున మీరు మీ యొక్క ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా, మేము కూడా మిమ్మల్ని మరచి పోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి!

15. నిశ్చయంగా వారే, మా సూచనలను (ఆయాత్ లను) విశ్వసించేవారు కేవలం వారే; ఎవరైతే వాటి ద్వారా హితబోధ చేయబడినప్పుడు సాష్టాంగంలో (సజ్దాలో) పడిపోతారో మరియు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతారు. మరియు ఆయనను స్తుతిస్తారు మరియు వారెన్నడూ గర్వపడరు.

16. వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు[1] మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు.

[1] రాత్రులలో లేచి తహజ్జుద్ (నఫిల్) నమాజులు చేస్తారు.

17. కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.[1]

[1] 'హదీస్' ఖుద్సీ: నేను నా పుణ్యాత్ములైన దాసుల కొరకు స్వర్గంలో సిద్ధపరచి ఉంచిన వాటిని ఇంతవరకు ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు మరియు ఏ మానవుని హృదయంలో కూడా వాటి ఊహ కలుగలేదు. ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స.ముస్లిం).

18. ఏమీ? విశ్వాసి అయినవాడు (దైవభీతి లేని) అవిధేయునితో సమానుడా? (కాదు!) వారు సరిసమానులు కాలేరు.[1]

[1] ఇటువంటి ఆయతులకు చూడండి, 45:21, 38:28, 59:20 మొదలైనవి.

19. ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో వారికి వారి కర్మల ఫలితంగా, వారి ఆతిథ్యం కొరకు స్వర్గవనాలలో నివాసాలుంటాయి.

20. ఇక ఎవరైతే, అవిధేయ వైఖరి అవలంబిస్తారో, వారి నివాసం నరకాగ్నియే. ప్రతిసారి వారు దాని నుండి బయట పడటానికి ప్రయత్నించినప్పుడల్లా, వారందులోకి తిరిగి నెట్టబడతారు. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని శిక్షను చవి చూడండి."

21. మరియు ఆ పెద్ద శిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను తప్పక రుచి చూపుతాము.[1] బహుశా, వారు (పశ్చాత్తాప పడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని!

[1] చూడండి, 52:47.

22. మరియు తన ప్రభువు సూచన (ఆయాత్) ల ద్వారా హితబోధ చేయబడిన తరువాత కూడా, వాటి నుండి విముఖుడయ్యే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం[1] చేసి తీరుతాము.

[1] అల్-ముంతఖిమ్ (సేకరించబడిన పదం):ప్రతీకారం తీర్చుకునే, ప్రతీకారం చేసే, దుష్టులను శిక్షించే వాడు. చూడండి, 30:47.

23. మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. కావున, (ఓ ప్రవక్తా!) నీవు అతనిని కలుసుకోబోయే విషయాన్ని గురించి సందేహంలో పడకు.[1] మరియు మేము దానిని (తౌరాత్ ను) ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేశాము.[2]

[1] మహాప్రవక్త ('స'అస) మె'అరాజ్ రాత్రిలో మూసా ('అ.స.) ను కలుసుకున్నప్పుడు అతను, దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)కు, అల్లాహ్ (సు.తా.) ను వేడుకొని, నమా'జ్ ల సంఖ్యను, తగ్గించుకోమని సలహా ఇచ్చిన విషయాన్ని ఈ ఆయత్ సూచిస్తుందని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. [2] ఇక్కడ 'దానిని' అనే సర్వనామం మూసా ('అ.స.) ను కూడా సూచించవచ్చు; అంటే మేము మూసాను ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శిగా చేశాము.

24. మరియు మేము (ఇస్రాయీల్ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగా చేశాము. వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు - ఎందుకంటే వారు సహనం వహించారు మరియు వారు మా ఆయాత్ (సూచనలను) దృఢంగా నమ్ముతూ ఉండేవారు!

25. నిశ్చయంగా, నీ ప్రభువు, పునరుత్థాన దినమున, వారికున్న భేదాభిప్రాయాలను గురించి వారి మధ్య తీర్పు చేస్తాడు.[1]

[1] చూడండి, 22:67-69.

26. ఏమీ? వీరికి పూర్వం అనేక తరాలను నాశనం చేసిన విషయం వీరికి మార్గదర్శకత్వం కాదా? వీరు, వారి నివాసస్థలాలలో తిరుగుతున్నారు కదా! నిశ్చయంగా ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఏమీ? వీరు వినటం లేదా?

27. ఏమీ? వారు చూడటం లేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) పంపి దాని ద్వారా పైరును ఉత్పత్తి చేస్తామనీ, దానిని వారి పశువులు మరియు వారూ తింటున్నారనీ. ఏమీ? వారిది గమనించటం (చూడటం) లేదా?

28. ఇంకా ఇలా అంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పండి!"[1]

[1] ఇక్కడ తీర్పు అంటే, ఆ తీర్పు దేనినైతే ముష్రిక్ ఖురైషులు తమ మీదికి తెమ్మని దైవప్రవక్త('స'అస) ను హేళనతో అడిగేవారో. అంటే అల్లాహ్ (సు.తా.) శిక్ష.

29. ఇలా అను: "ఆ తీర్పుదినం నాడు[1] సత్యతిరస్కారులు (అప్పుడు) విశ్వసించినా, అది వారికి ఏ విధంగానూ పనికిరాదు! మరియు వారికెలాంటి గడువు కూడా ఇవ్వబడదు."

[1] ఇక్కడ తీర్పుదినం అంటే పునరుత్థాన దినం.

30. కావున నీవు వారి నుండి విముఖుడవగు![1] మరియు వేచి ఉండు నిశ్చయంగా, వారు కూడా (ఆ దినం కొరకు) వేచి ఉంటారు.

[1] చూడండి, 6:106.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా లుఖ్మాన్సూరా అల్-అహ్'జాబ్ ›